Home ఆరోగ్యం స్లిమ్మింగ్ టెక్నిక్స్ తగ్గుట... ఆరోగ్యం పెరుగుట కొరకే!


 
స్లిమ్మింగ్ టెక్నిక్స్ తగ్గుట... ఆరోగ్యం పెరుగుట కొరకే! PDF Print E-mail
తగ్గి ఉండటం ఎప్పుడూ చెడుకాదనీ, అది మనకు మేలు చేస్తుందంటాడు వేమన. అంతేకాదు... కొండైనా కొన్నిచోట్ల తగ్గి ఉంటుందంటాడాయన. కొండ ఎందుకు తగ్గి ఉంటుందో మనకు తెలియదు గానీ... కొండలా ఒళ్లు పెంచుకున్న వాళ్లు తగ్గడం ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు డాక్టర్లు. తొలిదశల్లో కొన్ని జీవనశైలి టెక్నిక్స్‌తో బరువు తగ్గడం ఒక మార్గం. కానీ ఇక మన బరువు మన ప్రాణానికే ముప్పుతెచ్చే పరిస్థితుల్లో మాత్రం శస్త్రచికిత్సల్లాంటి కొన్ని ప్రక్రియలకు వెళ్లాలంటున్నారు. ఎందుకంటే అప్పుడు కొండలాంటి తమ బరువు కింద ప్రాణాలు నలిగిపోకుండా కాపాడటం మాత్రమే శరణ్యం కాబట్టి. మామూలు ప్రక్రియలు మొదలు, శస్త్రచికిత్స ప్రక్రియల వరకు బరువు తగ్గాల్సిన మార్గాలతోపాటు... వివిధ శస్త్రచికిత్స ప్రక్రియలపై అవగాహనకోసం... ఈ కథనం. 

మన బరువు కింద మన ప్రాణాలు నలగడం మామూలప్పుడే చాలా సాధారణం. అలాంటిది కొన్ని అనారోగ్యకరపరిస్థితుల్లో లావెక్కడం మరింత డేంజర్. ఆ పరిస్థితులు...

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) మధుమేహం (డయాబెటిస్) గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు (ఆర్థరైటిస్ ఆఫ్ నీ-హిప్ జాయింట్) గురకతో శ్వాస అందకపోవడం (స్లీప్ ఆప్నియా) డిప్రెషన్ వంటి సైకియాట్రిక్ డిజార్డర్స్.

బరువు తగ్గడానికి ఎన్నో ప్రక్రియలు... 
సాధారణంగా బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఉదాహరణకు జీవనశైలి మార్పులు, లోకార్బ్ డైట్, వాటర్ థెరపీ, లైపోసక్షన్ వంటి అనేక మార్గాలు అనుసరిస్తుంటారు. అయితే ఇవన్నీ ఉండాల్సిన బరువు కంటే లావు ఉన్నవారికి లేదా స్థూలకాయులుగా (అంటే బీఎంఐ 25 నుంచి 29 వరకు) ఉన్నవారికి కొంతవరకు ఉపయోగపడతాయి. 

జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ టెక్నిక్స్): ఇది మంచి ఆహారం, వ్యాయామం ద్వారా పాటించే సాధారణ నియమాలు. ఉదాహరణకు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్ల కోసం రెడ్‌మీట్ కాకుండా చేపల వంటి ఆహారంపై ఆధారపడటం, అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం, మసాలాలు తగ్గించడం (తద్వారా ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపించదు) వంటివి. ఇక వ్యాయామంలో భాగంగా ఒళ్లు పూర్తిగా బడలిక చెంది, నీరసంగా మారిపోని విధంగా మీరు భరించగలిగే పరిమితిలో నడక (బ్రిస్క్ వాక్), నెమ్మదిగా పరుగు (స్లో జాగింగ్) వంటి వ్యాయామాలు చేయడం. 

అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గడానికి అనుసరించే వాటిల్లో ఈ పద్ధతులు ఆరోగ్యకరం. ప్రతికూలతలు చాలా తక్కువ. అయితే గుండెజబ్బులకు లోనైనవారు సాయంత్రాల కంటే ఉదయం వేళలోనే వ్యాయామం చేయడం అవసరం. ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈత వంటి వ్యాయామాలు ఎంచుకోవాలి. 

లో కార్బ్ డైట్: ఇది కొందరు ఆహారనిపుణులు సూచించే మార్గం. ఇది కూడా ఇంచుమించు జీవనశైలి పద్ధతిలోనే ఉన్నా ఇందులో రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్లను పూర్తిగా పరిహరించి, చాలా తక్కువ మోతాదులో శక్తిని వెలువరించే పిండిపదార్థాలనే వాడతారు. అయితే దీన్ని నిపుణులైన వారి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. 

ప్రతికూలతలు: ఒక్కోసారి శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గడం, స్థూలకాయుడిని ప్రమాదకరమైన పరిస్థితికి నెట్టేయవచ్చు. ఒకసారి మామూలు స్థితికి వచ్చాక మళ్లీ సాధారణ ఆహారపు అలవాట్లతో పరిస్థితి మొదటికి రావచ్చు లేదా కార్బోహైడ్రేట్లు విపరీతంగా తగ్గడం వల్ల మొదటికే మోసం రావచ్చు. 

వాటర్ థెరపీ: నీళ్లకు, బరువుకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం కోసం అధ్యయనం చేశారు. దానిప్రకారం... ఒక వ్యక్తి తాగే నీళ్లు 17 ఔన్సులకంటే ఎక్కువ అయితే అతడిలో జీవక్రియల (బాడీ మెటబాలిజమ్) వేగం కూడా పెరుగుతుందని తేలింది. (28.35 గ్రాములు = ఒక ఔన్సు. అంటే 17 ఔన్సులు సుమారు 481,95 గ్రాములకు సమానం. అంటే ఉజ్జాయింపుగా అర లీటరు). దీన్నిబట్టి అరలీటరు కంటే ఎక్కువ నీళ్లు తాగాక జీవక్రియల వేగం పెరగడం వల్ల పెరిగే మెటబాలిజమ్ రేటు మామూలు కంటే 30 శాతం వేగంగా జరుగుతుంది. ఈ అధ్యయనం ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే వైద్యవిజ్ఞాన జర్నల్‌లో చోటుచేసుకుంది. దీన్నిబట్టి ఒక వ్యక్తి తాను తీసుకోవలసిన దాని కంటే ఒక రోజులో 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తాగితే అతడు రోజుకు 17,400 క్యాలరీలను బర్న్ చేయగలడు. దీన్నిబట్టి చూస్తే రోజూ 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువ తాగేవారు ఏడాది వ్యవధిలో దాదాపు 5 పౌండ్లు బరువు తగ్గడానికి అవకాశం ఉంది. (ఒక పౌండు = 0.4536 కిలోలు) అంటే... రోజూ లీటరున్నర నీళ్లు తాగేవారు ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది. 

అనుకూలతలు / ప్రతికూలతలు: ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆహారం తీసుకోవడం కొద్దిగా తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఉండటానికి ఈ అంశం దోహదపడుతుంది. ఇదొక్కటే అనుకూలత. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ఇది నమ్మకమైన ప్రక్రియ కాదు. నీళ్లు కొవ్వులను నేరుగా కరిగించలేవు. అందువల్ల కొవ్వు పేరుకోవడంతో పెరిగే బరువు వాటర్ థెరపీతో తగ్గదు.

శస్త్రచికిత్సల ప్రక్రియలివి... 
మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 33 దాటితే సాధారణ జీవనశైలిలో మార్పులు, ఆహారం వంటి స్వాభావిక ప్రక్రియలద్వారా సన్నబడటం ఒకింత కష్టమవుతుంది. అందుకే బీఎంఐ 33 నుంచి 40 ఉంటే వచ్చే ఆరోగ్యసమస్యలతో ప్రాణాపాయం కూడా కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ పరిమాణంలో బీఎంఐ ఉన్నవారికి తప్పనిసరి పరిస్థితుల కారణంగా బరువుతగ్గడానికి శస్త్రచికిత్సను సూచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్సలను బేరియాట్రిక్ సర్జన్స్ / సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు నిర్వహిస్తారు. ఆ ప్రక్రియలు స్థూలంగా... 

ల్యాపరోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అమర్చడం 
మనం తినే ఆహారం అన్నకోశం (స్టమక్)లోకి వెళ్తుంది. ఈ అన్నకోశం (స్టమక్) ఒక సంచిలా ఉంటుంది. మన పొట్ట నిండగానే తృప్తి కలుగుతుంది. మన నడుముకు బెల్ట్‌లాంటిది... శస్త్రచికిత్స ద్వారా ఒక బ్యాండ్‌ను అన్నకోశానికి అమర్చుతారు. మనిషి లావును బట్టి ఎంత మోతాదు ఆహారం అవసరమో నిర్ణయించి, దాన్ని బట్టి ఆ బ్యాండ్‌ను అమర్చుతారు. అందుకే దీన్ని అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అనవచ్చు. దాంతో స్టమక్ సైజ్ తగ్గుతుంది. ఫలితంగా కొంత తినగానే పొట్టనిండినట్లయి తృప్తి కలుగుతుంది. 

అనుకూలతలు / ప్రతికూలతలు: కేవలం గ్యాస్ట్రిక్ బ్యాండ్ అమర్చడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఈ ప్రొసీజర్ తర్వాత నిపుణులు సూచించిన విధంగా ఆహారనియమాలు పాటించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అలా చేయకపోతే దీనివల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. 

శస్త్రచికిత్స ద్వారా అన్నకోశాన్ని తొలగించడం 
బరువు విపరీతంగా పెరిగి అది ప్రాణాపాయంగా పరిణమించినప్పుడు శస్త్రచికిత్సతో 85 శాతం మేరకు అన్నకోశాన్ని (స్టమక్‌ను) తొలగిస్తారు. దాంతో అన్నకోశం కాస్తా ఒక పేగు ఆకృతికి మారుతుంది. 

అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి ఇది చాలా ప్రభావవంతమైన శస్త్రచికిత్స. అయితే అన్నకోశాన్ని తొలగించాక మళ్లీ మునుపటిలాగే తినడం వల్ల అన్నకోశం మళ్లీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలతో పాటు డైట్ గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాలి. 

ల్యాపరోస్కోపిక్ రూ-ఎన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్... 

ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై-పాస్ చేస్తూ నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానించి, అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచిని రూపొందించేలా ఈ సర్జరీ చేస్తారు. ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా చేస్తారు. ఈ ప్రక్రియనే అనాస్టొమోసిస్ అంటారు.

అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి అందుబాటులో ఉన్న అన్ని సర్జికల్ ప్రక్రియలలో ఇది మంచిదన్నది నిపుణుల మాట. అయితే అన్నకోశాన్ని పూర్తిగా బైపాస్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత వైటమిన్ లోపాల వల్ల వచ్చే ఆరోగ్యసమస్యలు కనిపించేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు వైటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. 

లాపరోస్కోపిక్ బిలియో - ప్యాంక్రియాటిక్ డైవర్షన్ (+/- డియోడోనల్ స్విచ్) 

ఇందులో అన్నకోశంతో పాటు కొంతమేరకు చిన్న పేగులను కూడా తొలగిస్తారు. ఫలితంగా తీసుకునే ఆహారంతో పాటు జీర్ణమయ్యే ఆహారం గణనీయంగా తగ్గి, బరువు తగ్గిపోవడం స్పష్టంగా తెలుస్తుంది. ఈ శస్త్రచికిత్సలో కొంతమేర పేగులను తొలగించి ఆహారమార్గాన్ని కుదిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా జీర్ణస్రావాలు పొట్టలోకి కాకుండా నేరుగా పేగుల్లోకి వచ్చేలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు. 

ఇవీ స్థూలంగా బరువు తగ్గడానికి ఉన్న మార్గాలు, వాటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు. ఇది కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే. వీటిని కొన్నింటిని నేరుగా ఆచరించడం ప్రమాదకరం కావచ్చు కూడా. ఉదాహరణకు విచక్షణరహితంగా చేసే డైటింగ్, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం వంటివి. ఇక బరువు తగ్గడానికి కొందరు కొన్ని మూలికలు, హెర్బ్స్ కూడా ఇస్తుంటారు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా మొదట ఫిజీషియన్‌ను సంప్రదించాలి. ఇక బరువు అన్నది ప్రాణాంతకంగా మారినప్పుడే (మార్బిడిటీకి దారితీసినప్పుడే) బేరియాట్రిక్ సర్జన్లు బరువు తగ్గే శస్త్రచికిత్సలను చేస్తారు. అంతే తప్ప బరువు తగ్గాలనుకునే ప్రతివారికీ అవే మార్గాలు కావని గుర్తుంచుకోవాలి.

- నిర్వహణ: యాసీన్

ఎవరెవరు ఎంత బరువుండాలి..?
ఒకరు తమ బరువు అనారోగ్యానికి దారితీసేంతగా ఉందా అని తెలుసుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి వారి వారి ఎత్తుకు అనుగుణంగా ఎంత బరువుండాలో తెలుస్తుంది. 

బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) పద్ధతితో కిలోగ్రాముల్లో మీ బరువును మీటర్లలో మీ ఎత్తు స్క్వేర్‌తో భాగించండి. వచ్చిన ఆ విలువను బట్టి మీరు ఉండాల్సినంత బరువు ఉన్నారా లేక ఎక్కువగా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. 

ఆ విలువ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు ఉండాల్సినదాని కంటే తక్కువ బరువు ఉన్నట్లు. 

18.5 నుంచి 24.99 ఉంటే మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లు 

25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు లావుగా ఉన్నట్లే 

25 నుంచి 29 ఉంటే మీరు స్థూలకాయులు (ఒబేస్) 

30 నుంచి 34.99 వరకు చాలా స్థూలకాయులు ఒబేస్ క్లాస్-1 (బాగా లావు) 

35 నుంచి 39.99 వరకు అయితే మరీ ఎక్కువ స్థూలకాయులు అన్నమాట. 

ఒబేస్ క్లాస్-2 (విపరీతమైన లావు)