Home డెంటల్ కేర్ పళ్ల ఆరోగ్యానికి... సూత్రాలు


 
పళ్ల ఆరోగ్యానికి... సూత్రాలు PDF Print E-mail

 

మనం మన పళ్ల ఉనికిని ఏ మాత్రం పట్టించుకోం. పొద్దున్న ఒకసారి బ్రష్ చేసుకున్న తర్వాత వాటి గురించి విస్మరిస్తాం. కానీ... అవి మనం జీవించి ఉంచడానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోడానికి నిత్యం సహాయం చేస్తుంటాయి. వాటికి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు తప్ప పంటి ఆరోగ్యం గురించి పట్టించుకోం. అలాంటి పళ్లు అన్నికాలాల్లో అందంగా ఉండాలంటే పాటించాల్సిన ఆరు సూత్రాల గురించి నిపుణులు చెబుతున్న సంగతులను మీ పిల్లలకు అలవర్చండి.

1. ప్రతిరోజూ రెండు పూటలా బ్రష్ చేసుకోవడం. ప్రతి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు... రాత్రి డిన్నర్ తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి.

2.రోజూ బ్రష్ చేసుకునే సమయంలో బ్రష్‌ను పళ్లపై ఏదో ఒకవైపు గట్టిగా రుద్దడం గాక... బ్రష్‌ను మృదువుగా గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు శుభ్రమవుతాయి. అదేపనిగా గట్టిగా రుద్దేయడం వల్ల జరిగే మేలు కంటే హాని ఎక్కువ.

3.రాత్రిపూట దారం సహాయంతో పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను తొలగించే ప్రక్రియ అయిన ఫ్లాసింగ్ చేసుకోండి. ప్రతిరాత్రీ ఫ్లాసింగ్ తర్వాతే నైట్‌బ్రషింగ్ చేసుకోవాలి. (మన దేశంలో ప్రజలు ఇంకా ఫ్లాసింగ్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇకనైనా ఫ్లాసింగ్ ప్రయోజనాలు తెలుసుకొని రాత్రి భోజనం తర్వాత ఫ్లాసింగ్ చేసుకోవడం అవసరం).

4. బ్రషింగ్ పూర్తయ్యాక తప్పనిసరిగా నాలుకను శుభ్రం చేసుకోవాలి. నోటిదుర్వాసనకు దోహదపడే బ్యాక్టీరియాను పెంపునకు అవసరమైన ఆహారపదార్థాల ముక్కలు ప్రధానంగా నాలుకపై వెనకభాగంలో ఉంటాయని గుర్తుంచుకోవాలి.

5.ఆహారం తీసుకున్న ప్రతిసారీ తేటగా ఉన్న నీటితో నోరు పుక్కిలించి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత చిగుళ్లపై మాలిష్ చేసుకున్నట్లుగా ఒకసారి వేలితో రాయాలి. దీనివల్ల చిగుళ్ల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.

6.ఒకవేళ ఆహారం తిన్న వెంటనే నోరు కడుక్కోలేకపోతే... చక్కెరలేని బబుల్‌గమ్‌ను (అందుబాటు లోఉంటే) నమలాలి. నోటిలో మిగిలిపోయిన ఆహారపదార్థాల ముక్కల తొలగింపునకు ఇది బాగా దోహదపడుతుంది. పిల్లలెలాగూ బబుల్ గమ్‌ను ఇష్టంగానే నములుతారు.