Home వ్యాధులు - నివారణ తలనొప్పిని వదిలించుకోండి


 
తలనొప్పిని వదిలించుకోండి PDF Print E-mail

ప్రైమరీ సెక్స్ హెడేక్ : సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందు వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొప్రానలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు ఉపయోగిస్తారు. 

ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో గురయ్యే రుగ్మత తలనొప్పి. వీటిలో దాదాపు 200 రకాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు రకాలను పేర్కొనవచ్చు. ప్రైమరీ తలనొప్పులు... ఇందులో నొప్పి, అందుకు కారణం తలలోనే ఉంటుంది. ఇక సెకండరీ తలనొప్పులు మరోరకం. ఇందులో మరేదో బయటి కారణంతో అంటే... తలలో గడ్డ లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి బాహ్యకారణాల వల్ల తలనొప్పి వస్తుంది. 

తలనొప్పి ఏదైనా, కారణాన్ని కనుగొనడం కూడా పెద్ద తలనొప్పే అంటారు డాక్టర్లు. ఎందుకంటే కొన్నిరకాల తలనొప్పులకు కారణాలు సీటీ స్కాన్/ఎమ్మారై పరీక్షల్లో కూడా కనిపించవు. మనలో కనిపించే అనేకరకాల తలనొప్పులపై అవగాహన కోసం ఈ కథనం. తలనొప్పి చాలా సాధారణ సమస్యే అయినా కొన్నిరకాల్లో మాత్రం ఈ లక్షణం రోగికి తన విశ్వరూపం చూపించి తీవ్ర సమస్యగా పరిణమించవచ్చు. ఇలా తగ్గకుండా తలనొప్పి వస్తుండటం కొన్నిసార్లు ఇతరత్రా ఏదైనా తీవ్రమైన సమస్యకు సూచికగా భావించి, కారణాన్ని వెదకాలి.

సెకండరీ తలనొప్పులు:

ఇతరత్రా బాహ్య కారణాలతో వచ్చే వీటిని ముందుగా పరిశీలిద్దాం!
మెనింజైటిస్: ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో కనిపించే లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్‌ను సీఎస్‌ఎఫ్ (మెదడులోని సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. 

ఇంట్రాక్రేనియల్ హేమరేజ్: తల(పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీస్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్: మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పి మెదడులోని గడ్డ పెరుగుతున్నకొద్దీ నొప్పి కూడా పెరుగుతూ, వారాల తరబడి కొనసాగుతుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు వంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. 

టెంపొరల్ ఆర్టిరైటిస్:

ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసువారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి రావడం, రాత్రుళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతలు నొక్కుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి దీని లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్ చాలా ఎక్కువగా ఉంటే దీన్ని నిర్ధారణ చేస్తారు. 


గ్లకోమా: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల వస్తుందిది. ఇందులో తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది నెమ్మదిగా చూపును హరించివేస్తుంది. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించాలి. 
ప్రైమరీ తలనొప్పులు: మెదడులోని జీవరసాయనాల్లో సమతౌల్యం లోపించడం వల్ల తలలోనే ఉద్భవించే తలనొప్పులివి. 

మైగ్రేన్: ఇది 15 శాతం యువతుల్లో, 6 శాతం యువకుల్లో వచ్చే సాధారణ సమస్య. తరచూ వచ్చిపోతుండే ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకేవైపు రావడం, కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుండటంతో పాటు ఒక్కోసారి నాలుగు నుంచి 72 గంటల పాటు వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం/ వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. 20 శాతం మందిలో చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు (జిగ్‌జాగ్ లైన్స్ ఆఫ్ లైట్స్) రూపంలోనూ కనిపిస్తాయి. 

ఇది తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రంగా శ్రమించి అలసటకు గురికావడం, వాతావరణంలో మార్పులు, అగరుబత్తి వంటి ఘాటైన వాసనలు, ఆల్కహాల్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్, యువతుల్లో రుతుస్రావ సమయంలో హార్మోన్ల మార్పులు, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్ కావడం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకే వీటిని మైగ్రేన్‌కు దోహదపడే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా పేర్కొంటారు. తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లోనూ ఏ లోపం కనిపించదు. ఈ అంశంతో పాటు పై లక్షణాలన్నీ కనిపిస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. 

చికిత్స: దీనికి రెండు రకాల చికిత్స చేస్తారు. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స. ఇది సాధారణ నొప్పి నివారణ మందులతో తగ్గనప్పుడు, తక్షణం తలనొప్పిని తగ్గించడానికి రిజాట్రిప్టాన్ / అల్మోట్రిప్టాన్ వంటి ‘ట్రిప్టాన్స్’ వాడతారు. వీటిని తలనొప్పి మొదలయ్యాక ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా ఉపశమనం ఉంటుంది. ఒకవేళ ఈ మందు ఇచ్చాక రెండు గంటల్లో తలనొప్పి తగ్గకపోతే మళ్లీ మరో మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులు (ట్రిప్టాన్స్) వాడేవారు రెండు డోసులు వాడినా తలనొప్పి తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. 

మళ్లీ రాకుండా నివారించడానికి

తక్షణం తగ్గడానికి తీసుకునే మందులతో పాటు సమస్య తిరగబెట్టకుండా ఉండటానికీ మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. టోపిరమేట్, డైవాల్ప్రోయేట్, ప్రొప్రానోలాల్, ఫ్లునారాజైన్ వంటి మందులతో మళ్లీ సమస్య రాకుండా నివారించవచ్చు. మందులతో పాటు యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఉపయోగపడతాయి. వీటితో తగ్గని మైగ్రేన్‌లకు బొటాక్స్ ఇంజెక్షన్‌ను వాడుతున్నారు. 

టెన్షన్ హెడేక్: తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి తలనొప్పిగా అది వ్యక్తం కావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఇది దీర్ఘకాలంగా వస్తూ, తలకు ఇరువైపులా ఉంటుంది. తలను గట్టిగా బిగించి కట్టినట్లుగా ఉండటం, తీవ్రతను బట్టి పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులు, నెలల తరబడి కనిపించడం కూడా ఉంటుంది. సాధారణ తలనొప్పి మందులతో దీన్ని తగ్గించుకోవచ్చు. అమీట్రిప్టిలిన్ వంటి మందులు టెన్షన్ తలనొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. 

క్లస్టర్ హెడేక్: ఇది ఒకింత అరుదైన తలనొప్పి (కేవలం వేయిమందిలో వచ్చే వెయ్యి తలనొప్పుల్లో ఒకరికి మాత్రమే కనిపిస్తుంది). కంటిపాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో వస్తుంది. మూడుగంటల కంటే తక్కువ సేపు ఉంటుంది. ఒక్కోసారి కొద్దిరోజులపాటు తిరగబెడుతూ ఉంటుంది. అప్పుడది రోజూ ఒకేవేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8-10 వారాల పాటు వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాదిపాటు రాదు. ఇక ఆ తదుపరి ఏడాది మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8-10 వారాల పాటు అదే వేళకు కనిపిస్తూ ఉంటుంది. 

చికిత్స: దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందించడం లేదా ట్రిప్టాన్ మందులను ముక్కు ద్వారా పీల్చేలా చేస్తారు. దీనితో మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి లిథియమ్‌తో పాటు విరపామిల్ వందును ఉపయోగిస్తారు. క్రానిక్ డైలీ హెడేక్: దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులను వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందులు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తుంటుంది. వీళ్లకు ఎర్గాటమైన్స్,

ఆన్‌డెన్‌సెట్రాన్ వంటి మందులు ఇచ్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. 
ప్రైమరీ కాఫ్ హెడేక్: తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తరహా తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచిరక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావచ్చు. 

హిప్నిక్ హెడేక్: నిద్రలోనే మొదలై దాదాపు 15-30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటినవారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స. 
తలనొప్పి వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఉండాలి. తరచూ తలనొప్పి అదేపనిగా మాటిమాటికీ వస్తుంటే డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. 

ఏయే సందర్భాల్లో తలనొప్పిని తీవ్రంగా పరిగణించాలి? 
జీవితంలో మొట్టమొదటి తీవ్రమైన తలనొప్పి రావడం రావడమే చాలా తీవ్రవేదన కలిగించేంత తీవ్రంగా తలనొప్పి ఉండటం వారాలు గడుస్తున్నా తగ్గకుండా తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు తలనొప్పితో పాటు జ్వరం/నీరసం /ఫిట్స్ /క్యాన్సర్ /కళ్లు మసకగా మారడం వంటి ఇతర లక్షణాలూ జోడైనప్పుడు పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు నిద్రాభంగం కలిగిస్తున్నప్పుడు... పైనపేర్కొన్న అంశాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్‌ఎఫ్ పరీక్ష వంటివి చేయాలి. ఆ పరీక్షలు చేసి తలలో రక్తస్రావం/గడ్డ/ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోవాలి. 

మైగ్రేన్ కొన్ని ఆసక్తికరమైన అంశాలు
తలనొప్పికి చికిత్స చేసే న్యూరాలజిస్టుల్లోనూ 70 శాతం మందికి మైగ్రేన్‌తో బాధపడుతున్నవారే సెరీనా విలియమ్స్ బాగా చెమటోడ్చి ఆడిన ప్రతిసారీ మైగ్రేన్‌తో బాధపడుతుంటుంది జూలియస్ సీజర్, నెపోలియన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎలిజబెత్ టేలర్, ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖులు మైగ్రేన్‌తో బాధపడినవారే.