Home వ్యాధులు - నివారణ తరచు అలర్జీ, ఆయాసం, సైనస్..?


 
తరచు అలర్జీ, ఆయాసం, సైనస్..? PDF Print E-mail

నాలుగైదేళ్లుగా ఎలర్జీ, ఆయాసంతో బాధపడుతున్నాను. సైనస్ కూడా ఉంది. ఇది శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఆపరేషన్ చేయాలన్నారు. నా ఈ సమస్యలకు ఆయుర్వేదమందులు, సలహాలు సూచింప ప్రార్థన. అసలు ఇది మందులతో తగ్గుతుందా?

 

మీ బాధల్ని నియంత్రించుకోవడానికి ఎన్నో ఉపశమన మార్గాలుఉన్నాయి. మీరేమీ ఆందోళన చెందనవసరం లేదు. ఈ కింది మందులు వాడండి.

షడ్బిందుతైలం (ముక్కులో చుక్కల మందు): ఒక్కొక్క నాసికారంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున, రెండుపూటలా వేసుకోవాలి.

హింగుకర్పూరవటి: ఈ మాత్రను నీటిలో అరగదీసి, ముద్దగా చేసి సైనస్ నొప్పి ఉన్నచోట పైపూతగా రాయండి.

నారదీయ లక్ష్మీవిలాసరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1
పసుపు వేసిన వేడినీటితో ముక్కుకి, ముఖానికి ఆవిరి పట్టాలి. 
రెండుపూటలా ప్రాణాయామం చెయ్యాలి.

ఆయాసం: దీన్నే ఉబ్బసం (ఆస్త్మా) అంటారు. ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. మేఘావృత వాతావరణం, చల్లటి వాతావరణం, అసాత్మ్య ద్రవ్యాలు, దుమ్ముధూళి, కొన్నిరకాల వాసనలు, ఆహార పదార్థాలు మొదలైనవి ప్రధాన కారణాలు. వారసత్వం, మానసిక ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. వయసు వల్ల, శరీరంలోని మార్పుల వల్ల, పరిస్థితుల మార్పు వల్ల ఈ వ్యాధి దానంతట అదే బలహీన పడుతుంది. ఈక్రింది మందుల వల్ల వ్యాధిని నియంత్రణలోకి తేవచ్చు.

శృంగారాభ్రరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1, అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం): ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించాలి. ఇవి ఆయాసం లేనప్పుడు కూడా వాడుకోవచ్చు. ఆయాసం ఉన్నప్పుడు: కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం): 2-4 చెంచాల మందుకి సమానంగా గోరువెచ్చని నీళ్లు కలిపి రోజుకి 3 - 4 సార్లు తాగాలి.

నివారణ: వీలున్నంతవరకు వ్యాధి కారణాలకు దూరంగా ఉండాలి.