Home చిట్టి కథలు నిజమైన రాజకుమారుడు


 
నిజమైన రాజకుమారుడు PDF Print E-mail

ఒక రాజ దంపతులకి లేక లేక కుమార్తె పుట్టింది. రాజు ఆనందంతో సంబరాలు జరిపించాడు. ఆ పాపకు పేరు పెట్టే సమయంలో కొంతమంది దేవతలు కూడా వచ్చారు. అకస్మాత్తుగా ఒక ముసలి స్త్రీ వచ్చి, ‘‘అందరికంటే పెద్దదాన్నైన నన్ను ఆహ్వానించలేదు. మీకెంత ధైర్యం? ఇందుకు శిక్షగా మీ పాపకి శాపం ఇస్తున్నాను - ఆమె ఇరవైయ్యేళ్ల వయసులో చనిపోతుంది’’ అని శపించి, వెళ్లిపోయింది.

రాజు, రాణి దిగులుతో కూలబడిపోయారు. వారి స్థితి చూసి, జాలిపడి, దేవతలు ‘‘రాజా, బాధపడకు. ఆమె శాపం ఉపసంహరించలేము గానీ, తగ్గించగలము. ఇరవైయ్యేళ్లు వచ్చాక యువరాణి చనిపోకుండా గాఢ నిద్రలోకి వెళ్తుంది. ఎవరైన యువరాజు వచ్చి ఆమెను తాకితే ఆమె మేలుకుంటుంది. ఇక ఏ సమస్యా ఉండదు’’ అన్నారు.

రాజు కాస్త ఊరట చెందాడు.
క్రమ క్రమంగా రాజుగారి కుమార్తె అందమైన యువరాణిగా పెరిగింది. సరిగ్గా ఆమె 20వ పుట్టిన రోజునాడు కళ్లు తిరిగి పడిపోయి, అలాగే గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది.
అప్పటినుండి రాజు ఎంతో జాగ్రత్తగా ఆమెను కాపాడుతూ ఉన్నాడు.

ఒకరోజు రాజభటులు ఒక యువకుడిని సభలోకి తీసుకువచ్చారు. విచారించగా, అతను ఒక యువరాజని తెలిసింది. ‘‘నేను కోసల దేశపు యువరాజుని, వేటాడుతూ వేటాడుతూ దారి తప్పి మీ రాజ్య పొలిమేర ల్లోకి వచ్చాను. దుస్తులు దుమ్ముతో ఉండటం వలన నన్ను మీవాళ్లు గుర్తు పట్టలేదు’’ అన్నాడు ఆ యువకుడు. రాజుగారికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అతను నిజమైన యువరాజో కాదో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చేద్దామనుకున్నాడు.
అతన్ని, నిద్రపోతున్న యువరాణి ఉన్న మందిరానికి తీసుకెళ్లి, ‘‘యువరాణిని నిద్రలేపగలవా?’’ అని అడిగాడు.

యువకుడు వెళ్లి యువరాణి నుదురు ముట్టుకోగానే ఆమె నిద్ర నుండి మేలుకుంది.
రాజు ఆనందంతో యువకుణ్ని దగ్గరకు తీసుకున్నాడు. అతను నిజమైన యువరాజే అని నిశ్చయమైపోయింది. అతని తల్లిదండ్రులతో మాట్లాడి, తన కుమార్తెను అతనికిచ్చి వివాహం జరిపించాడు.