కోరిక PDF Print E-mail

ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది తెల్లగా, అందంగా ఉండేది. ఆ అడవిలోని గుర్రాలన్నింటి కన్నా అదే వేగంగా పరిగెత్తేది. కానీ అది అసంతృప్తిగా ఉండే ది. ఒకసారి ఒక ముని ఆ అడవిలో నుండి వెళ్తున్నాడు. అతడు చాలా మహిమ గలవాడు. వరాలను ప్రసాదించే శక్తి కూడా అతనికి ఉంది.

అడవిలో తిరుగుతున్న గుర్రం ఆ మునిని చూసి, ‘‘నమస్సుమాంజలులు మునివర్యా!’’ అని దండం పెట్టింది. ఆ ముని గుర్రాన్ని ఆశీర్వదించాడు. ఏమైనా వరం కావాలంటే కోరుకొమ్మన్నాడు. అప్పుడు ఆ గుర్రం ‘‘స్వామీ! నాకు మరింత అందం కావాలనుంది. నన్ను ఇంకా తెల్లగా చేయండి. అలానే ఇంకా వేగంగా పరిగెత్తేందుకు అనువుగా నా కాళ్లను మార్చండి. ఇంకా నేను చాలా బలవంతుడినయ్యేట్టు చేయండి’’ అని వరం అడిగింది. ‘‘తథాస్త్తు’’ అన్నాడు మహిమ గల ఆ ముని. వెంటనే గుర్రం మారిపోయింది. అది ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా అయ్యింది. చిన్న మరక కూడా కొట్టొచ్చినట్టు కనిపించేలా ఉంది.

వేగంగా పరిగెత్తేందుకు అనువుగా మారిన దాని కాళ్లు చూడడానికి విచిత్రంగా ఉన్నాయి. బలవంతుడిలా మారిన ఆ గుర్రం పెద్ద పెద్ద కండలతో వికృతంగా కనిపిస్తోంది. మారిన తన శరీరం తనకే అసహ్యంగా అనిపించింది ఆ గుర్రానికి. వెంటనే తనను పూర్వపుస్థితికి తీసుకురమ్మని మునిని వేడుకొంది గుర్రం. ముని ఆ గుర్రానికి పూర్వపుస్థితిని తెచ్చాడు. ‘‘భగవంతుడు ఏ జీవి ఎలా ఉంటే మంచిదో అలా తయారు చేశాడు. కాబట్టి మనం వేరే లక్షణాలు కావాలని కోరుకోవడం తప్పు’’ అని చెప్పి అక్కడి నుండి కదిలాడు ఆ మునిపుంగవుడు.