Home చిట్టి కథలు ప్రత్యుపకారం


 
ప్రత్యుపకారం PDF Print E-mail

ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది తన గుహలో నిద్రిస్తుండగా హఠాత్తుగా ఒక ఎలుక దాని మీద పడింది. ఉలిక్కి పడి లేచి ఎలుకను పట్టుకుంది సింహం. ఆహారం కోసం ఆ గుహలో వెతుకుతూ గోడపై నుండి వెళుతూ పట్టు తప్పి సింహంపై పడింది ఆ ఎలుక. సింహం ఎలుకను చంపబోతుంటే తనను చంపొద్దని బతిమాలింది. ముందు ముందు తను సింహానికి ఏదైనా ఉపకారం చేస్తానని ఎలుక చెప్పడంతో సింహం ఎలుకను వదిలేసింది.

కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు అడవికి సర్కస్ వాళ్లు వచ్చారు. సింహాన్ని బంధించి బోనులో పెట్టారు. అడవిలో దారి బాగులేకపోవడం వలన వాహనాన్ని దారి బాగున్న చోటనే నిలిపారు. అటుగా వెళ్తున్న ఎలుక ఆ వాహనాన్ని చూసింది. ‘ఇక్కడది ఎందుకుందబ్బా!’ అని ఆలోచిస్తుండగానే ఒక బోనును మోసుకొస్తున్న నలుగురు వ్యక్తులు కనిపించారు. బోనులో చూస్తే సింహం ఉంది. సింహాన్ని పట్టుకెళ్తున్నారని అర్థమైంది ఎలుకకు.

సింహాన్ని ఎలా కాపాడాలా? అని ఆలోచించింది ఎలుక. దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ వాహనానికి ఉన్న నాలుగు చక్రాలను కొరికింది. దీంతో వాటిలోని గాలి పోయి, వాహనం ముందుకు కదలలేదు. దాంతో ఆ సర్కస్ వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చీకటిపడితే తాము క్రూరజంతువులకు ఆహారం కావలసి వస్తుందన్నాడు ఒకడు.

దీంతో వారు భయపడి బోనులోని సింహాన్ని విడిచిపెట్టి, వాహనాన్ని కూడా అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారు. వారు వెళ్లాక ఎలుక సింహం దగ్గరకు వెళ్లి ‘‘మిత్రమా! ఇది నీ జీవన్మరణ సమస్య. నువ్వు నీ పూర్తి బలాన్ని ఉపయోగించి ఈ బోనుని బద్దలుకొట్టి బయటకురా’’ అని ప్రోత్సహించింది. అలానే చేసి బోనుని బద్దలుకొట్టి బయటకు వచ్చింది ఆ సింహం. అప్పటి నుండి ఎలుక, సింహం మంచి మిత్రులయ్యాయి.