పుణ్యంలో సగం Print
సోమయ్య అనే వ్యక్తి ఎంతో మంచివాడు. తనకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయాలనే మనస్తత్వం కలవాడు. అయితే అతని ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే.

పేదరికం అతనిని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు ఒక పెద్ద కుటుంబాన్ని పోషించుకోవలసిన బాధ్యత అతని మీద వుంది.

అందువల్ల సోమయ్య ఇతరులకు డబ్బు సాయం చేయలేకపోయినా మాటసాయం మాత్రం చేస్తుండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గభాలున వెళ్ళి ఆదుకుని చేయగలిగిన పని చేసి వస్తుండేవాడు.

ఒకరోజు సోమయ్య వాకిట్లో అరుగుమీద కూర్చుని తాళ్లు పేనుకుంటూ వుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతను తన పేరు వీరయ్య అనీ భార్యాపిల్లలతో కలిసి అరణ్యమార్గంపై వస్తుండగా దొంగలు వచ్చి తమ దగ్గర వున్న డబ్బు, బట్టలతో సహా అంతా దోచుకుపోయారని భోరున విలపిస్తూ చెప్పాడు. భార్యా బిడ్డలను ఆలయం దగ్గర కూర్చోబెట్టి తాను సాయం కోసం వచ్చానన్నాడు.

సోమయ్య అతని పరిస్థితికి జాలిపడ్డాడు. కానీ తనదగ్గర ఏమీ లేకపోవడంతో ఒక ఆలోచన చేశాడు. ‘‘చూడు వీరయ్యా! నేను నీకు ఏమీ ఇవ్వలేను. కానీ ఇక్కడికి సమీపంలో దానయ్య అని ఒక ధనవంతుడు వున్నాడు. అతనిని అడుగు నీకు ఏమైనా ఇస్తాడు’’ అని దానయ్య ఇంటికి వెళ్లే దారి వివరంగా చెప్పాడు.

వీరయ్య వెళ్లి అడుగ్గానే దానయ్య కొంత డబ్బు, బట్టలు, భోజనపదార్థాలు ఇచ్చాడు. 
కొన్నాళ్లకు దానయ్య, సోమయ్య చనిపోయారు. దేవదూతలు వచ్చి దానయ్యను స్వర్గానికి తీసుకువెళ్లారు. తనతోపాటూ సోమయ్య కూడా వుండటం చూసి దానయ్య ఆశ్చర్యపోగా ‘‘నువ్వు దానం చేసి పుణ్యం సంపాదించావు. దానం చేసే నిన్ను గురించి చెప్పి నీ పుణ్యంలో కొంతభాగం సోమయ్య కూడా సంపాదించాడు’’ అని దేవదూతలు చెప్పారు.