Home చిట్టి కథలు సరైన చికిత్స


 
సరైన చికిత్స PDF Print E-mail
వేదపురి గ్రామంలో పంటలు విరివిగా పండేవి. అదీ ఇదీ అని లేకుండా వరి మొదలు అరటి వరకూ అన్ని రకాల పంటలకూ, తోటలకూ వేదపురి గ్రామం నిలయంగా వుండేది.
పంటలు పుష్కలంగా పండటంతో ఆ ఊరి ప్రజలంతా తమకు కావల్సినంత ఉపయోగించుకుని, మిగిలింది అమ్ముకుని సుఖ సంతోషాలతో తులతూగుతుండేవారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగ వుండదు. హఠాత్తుగా ఎలా వచ్చిందో ఏమో పంటలకు విపరీతంగా చీడ వచ్చింది. అదీ ఇదీ అని లేకుండా అన్నిరకాల పంటలకూ, తోటలకూ చీడ సోకి పాడై పోవడం మొదలయ్యింది. గ్రామస్థులకు ఏమి చేయాలో తోచలేదు.

ఒకరోజు ఒక సాధువు వచ్చి ‘‘మీ ఊరిలో పాపం పెరిగి పోయింది, అందువల్లనే పంటలకు ఇలా అయింది. నేను దీనికి శాంతి చేయిస్తాను’’ అంటూ ఒక్కొక్కరి దగ్గర వందరూపాయలు తీసుకుని తెల్లారేసరికి పారిపోయాడు.

కొన్నాళ్ల తర్వాత ఒక మంత్రగాడు వచ్చి ‘‘మీ ఊరిలో దుష్టశక్తులు సంచరిస్తున్నాయి. వాటిని తరిమేయాలంటే నాకు కొంత బంగారం ఇవ్వాలి’’ అని బంగారం తీసుకుని మాయమైపోయాడు.

అటు తర్వాత ఒక జ్యోతిష్యుడు వచ్చి ‘‘మీ ఊరికి శని పట్టింది. శనిని వదిలించాలంటే ఇంటింటినుంచీ నాకు నేను చెప్పిన కానుకలు ఇవ్వాలి’’ అని చెప్పి అవన్నీ మూట గట్టుకుని రాత్రికి రాత్రే జారుకున్నాడు.

ఆ తర్వాత ఒక యువకుడు వచ్చి ‘‘మీ ఊళ్లో పంటలకు తెగులు సోకింది. క్రిమిసంహారక మందులు చల్లితే చాలు’’ అని మందులు తెప్పించి చల్లడంతో తెగులు నశించి పంటలు బాగుపడ్డాయి.