Home చిట్టి కథలు కొత్త కుందేలు


 
కొత్త కుందేలు PDF Print E-mail
ఒక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. ఆ రెండింటికీ క్షణం సరిపడేది కాదు. కుందేలు వేగంగా గెంతుతూ వెళ్ళడం చూస్తే తాబేలుకు ఈర్ష్యగా వుండేది. అలాగే తాబేలు నెమ్మది నెమ్మదిగా నడవడం చూసి కుందేలుకు విచిత్రంగా వుండేది. ఒకరోజు కుందేలు తాబేలును పిలిచి ‘దూరంగా కనిపించే మర్రిచెట్టు వుంది చూశావూ! అక్కడికి మన ఇద్దరిలో ఎవరు ముందు వెళతారో పందెం వేసుకుందామా?’ అన్నది.

తాబేలు ఆలోచించింది. తాబేలుకు తాను చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. అప్పుడు ఒక కుందేలు ఇలాగే పందెం వేస్తే కుందేలు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వస్తుందనే విషయం తెలియని తాబేలు చకచకా వెళ్ళి పోయిందట. కాబట్టి తానేమీ కంగారుపడాల్సిన అవసరం లేదు అనుకున్నది. సరేనని పందానికి అంగీకరించింది తాబేలు.

మామూలు కంటే ఇంకా నెమ్మదిగా నడవటం ప్రారంభించింది తాబేలు. కుందేలు కూడా బాగా ఆలోచించింది, తాను చిన్నప్పుడు విన్న కుందేలు, తాబేలు కథ దానికి కూడా గుర్తొచ్చింది. అప్పట్లో కుందేలు తాబేలును తక్కువగా అనుకుని దాని చేతిలో ఓడిపోయింది.

కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయకూడదు అలాగే తన శక్తి గురించి ఎక్కువగా ఊహించుకోకూడదు. అన్నిటికీ మించి గమ్యం చేరే వరకూ ఎక్కడా విశ్రమించకూడదు అనుకున్న కుందేలు మరోదారిలో మామూలు కంటే వేగంగా పరుగెడుతూ ఎక్కడా ఆగకుండా గమ్యం చేరుకుంది. ఆనక విశ్రాంతిగా కూర్చుని తన వెంట తెచ్చుకున్న పండ్లు తీరిగ్గా తినసాగింది.

తర్వాత చాలాసేపటికి నెమ్మదిగా వచ్చిన తాబేలు అప్పటికే అక్కడికి చేరుకుని దర్జాగా కూర్చున్న కుందేలును చూసి ‘కాలం మారింది. నేనూ మారాలి’ అనుకుంది.