Home స్త్రీలు ఆరోగ్యం గర్భవతులు ఆరోగ్యం


 
గర్భవతులు ఆరోగ్యం PDF Print E-mail
ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం చాలా సాధారణంగా జరిగేదే. ఈ సమయంలో గర్భవతులు 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతారు. అయితే ఎవరెవరు ఎంతెంత బరువు పెరగడం ఆరోగ్యకరం అన్న విషయం... గర్భవతి కాకమునుపు వారున్న బరువుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బరువు విషయంలో వారి శరీరతత్వం ఏమిటి అన్నది వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి బరువును కేజీల్లో తీసుకుని, దాన్ని మీటర్లలో వారి ఎత్తు స్క్వేర్‌తో భాగిస్తే వచ్చే సంఖ్యను ‘బీఎంఐ’ అంటారు. (కిలోగ్రామ్స్ / మీటర్స్ స్క్కేర్). ఇలా లెక్కవేయగా వచ్చిన ఈ సంఖ్య 18 కంటే తక్కువగా ఉంటే... వారిని తక్కువ బరువువారిగా(అండర్‌వెయిట్‌గా) వర్గీకరించవచ్చు. అలాగే ఈ సంఖ్య 18.5 నుంచి 24.9 వరకు ఉంటే వారిని సాధారణ బరువు ఉన్నవారిగా చెప్పవచ్చు. అదే 25 నుంచి 29.9 వరకు ఉంటే వారిని ఎక్కువ బరువు ఉన్నవారిగానూ(ఓవర్ వెయిట్), 30 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయులుగానూ (ఓబేస్‌గా) చెప్పవచ్చు. 

వీరిలో బరువు తక్కువగా ఉన్నవారు (అండర్ వెయిట్ మహిళలు) ప్రెగ్నెన్సీ టైమ్‌లో 15 కిలోల వరకు పెరిగినా పర్లేదు. కానీ స్థూలకాయులు మాత్రం 5 నుంచి 9 కిలలో లోపే తమ బరువు పెరుగుదలను పరిమితం చేసుకోవడం మంచిది. సగటున చూస్తే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు సాధారణంగా వారినికి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు. ఇక వేవిళ్లతో బాధపడుతూ తరచూ వాంతులు చేసుకునేవారు 20 వారాలలోపు ఒక్కొక్కసారి అసలు బరువే పెరగకపోవచ్చు. ఇలా బరువు పెరగకపోవడం అన్నది కూడా వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకూ (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు. 

చాలామంది ప్రెగ్నెన్సీలో బరువు పెరుగుతూ పోతూ, సిజేరియన్ తర్వాత ఒళ్లు వచ్చిందంటూ బాధపడుతుంటారు. నిజానికి సిజేరియన్‌కూ బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తినడంతో పాటు బిడ్డకు పాలు తాగించడం, సంరక్షించడంలో పడిపోయి తమ గురించి తగినంత శ్రద్ధ తీసుకోకపోవడంతో జరిగే పరిణామం ఇది. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు. శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇక గర్భవతులు ఇద్దరి కోసం తినాలంటూ వారిని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం అన్నది సరికాదని గ్రహించాలి.