Home స్త్రీలు ఆరోగ్యం పీరియడ్స్ వస్తే చాలు... విపరీతమైన కోపం, ఆందోళన!


 
పీరియడ్స్ వస్తే చాలు... విపరీతమైన కోపం, ఆందోళన! PDF Print E-mail

నా వయసు 32. పెళ్లయింది. హ్యాపీగానే ఉన్నాను. అయితే ఇటీవల కొంతకాలం నుంచి నాకు కోపం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లమీద అయిన దానికీ, కానిదానికీ చికాకు పడటం, విసుక్కోవటం చేస్తున్నాను. మామూలుగా నాది శాంతస్వభావం. అయితే ఈ కోపం పిరియడ్స్ టైమ్‌లోనే ఉంటోంది. పిరియడ్స్ రావడానికి 5-10 రోజుల ముందు మొదలై, అయిపోయేంతవరకు కొనసాగుతోంది. ఆ సమయంలో నా మూడ్ ఏమాత్రం బాగుండటం లేదు. ఇది తప్ప ఇతరత్రా సమస్యలు ఏమీ లేవు. కోపం వచ్చినప్పుడు అవతలి వారి స్పందనను బట్టి నాకు ఏడుపు రావటం, చేతిలో ఏది ఉంటే అది విసిరేయటం జరుగుతోంది. రాత్రిపూట నిద్ర సరిగా పోలేకపోతున్నాను. గైనకాలజిస్టును సంప్రదిస్తే, ఆమె హార్మోనల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు కానీ, దానివల్ల నాకేమాత్రం ప్రయోజనం కలగలేదు. నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు. 


మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మెడికల్ పరిభాషలో ప్రీ- మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లేదా ప్రీ మెన్‌స్ట్రువల్ టెన్షన్ అంటారు. సాధారణంగా రుతుచక్రం ఆరంభమయిన పదిహేనేళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయనంలో చోటుచేసుకునే అసమానతల వల్ల డిప్రెషన్, ఆందోళన వంటివి ఏర్పడతాయి. 


ఈ స్థితిలో శరీరమంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, చిన్నపనికి కూడా అలసిపోవటం, చేస్తున్న పని మీద శ్రద్ధాసక్తులు మందగించటం, కడుపులో మంటలు, అజీర్తి, ఆకలి లేకపోవటం, ఊరికూరికే చెమటలు పట్టడం, హృదయస్పందనలో విపరీతమైన తేడాలు, శ్వాసబరువుగా తీసుకోవడం వంటి శారీరక మార్పులు కనపడతాయి. వీటితోబాటు అయోమయం, అస్థిరత, అర్థం చేసుకోలేకపోవటం, మూడ్స్ క్షణక్షణానికీ మారిపోవడం వంటి మానసికపరమైన మార్పులూ చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న శబ్దాలను కూడా భరించలేకపోవటం, వెలుతురును చూడలేకపోవటం, చీటికిమాటికీ కోపం తెచ్చుకోవడం, వెక్కిళ్లతో కూడిన ఏడుపు రావటం, నిద్ర అసలు పట్టకపోవడం లేదా పీడకలలతో కలత నిద్ర, తలదిమ్ముగా ఉండటం వంటివి సర్వసాధారణంగా కనిపించే మానసిక లక్షణాలు. 


వీటిమూలంగా కుటుంబ కలహాలు, కాపురంలో కలతలు ఏర్పడతాయి. ఇవన్నీ పీరియడ్స్‌కి నాలుగైదు రోజుల ముందు మొదలై, పీరియడ్స్ అయిపోయేవరకు కొనసాగుతాయి. దీనికి హార్మోన్ చికిత్స ఒక్కటే పరిష్కారం కాదు. దానివల్ల మానసికపరమైన భావోద్వేగాలు అదుపులోకి రావు. మానసిక0వైద్యుల పర్యవేక్షణలో తక్కువ మోతాదులో యాంటీడిప్రెసెంట్స్, యాంటీ -యాంగ్జైటీ మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కొద్దినెలలపాటు తీసుకుంటే సరిపోతుంది. 

మీరు వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్‌ను కలవండి. విష్ యు ఆల్‌ది బెస్ట్.