Home Vidhya - విద్య Health Care Education - హెల్త్‌కేర్


 
Health Care Education - హెల్త్‌కేర్ PDF Print E-mail
వైద్యరంగమంటే కేవలం వైద్యులే కాదు. ఎంతో మంది అనుబంధ నిపుణుల సేవలూ కీలకమే.
కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం, ప్రజలు తరచూ రోగాల బారిన పడడం, ఆరోగ్యంపై అవగాహన...లాంటి కారణాలతో హెల్త్‌కేర్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ రంగంలో అనుభవజ్ఞుల సేవల అవసరమూ పెరుగుతోంది. డాక్టర్లు కానప్పటికీ వివిధ కోర్సులతో హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రవేశించొచ్చు.

మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ

వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం.

కోర్సులు-అర్హతలు:
కోర్సు: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ). మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు నిర్వహిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు. అర్హత: పదో తరగతి.
కోర్సు: ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)
ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు ఈ కోర్సును అందిస్తోంది.
కాల వ్యవధి: రెండేళ్లు. అర్హత: పదోతరగతి.

కోర్సు: బీఎంఎల్‌టీ(బీఎస్సీ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ) కాల వ్యవధి: మూడేళ్లు
అర్హత: బైపీసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంఎల్‌టీ) లేదా డిప్లొమా ఇన్ ఎంఎల్‌టీ చేసిన వారు అర్హులు.

ఎంపిక: ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేస్తుంది. ఇంటర్ సబ్జెక్టుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో కాలేజీలు: 54
మొత్తం సీట్లు: 1905
వెబ్‌సైట్: http://59.163.116.210

ఉన్నత విద్య:
పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసినవారు మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సులో చేరొచ్చు.ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వహించే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు... మూడేళ్ల బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సును అభ్యసించవచ్చు. బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీ (మైక్రోబయాలజీ), బీఎస్సీ (బయో కెమిస్ట్రీ), బీఎస్సీ (బయోటెక్), బీజడ్‌సీ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు.

ఎలాంటి పరీక్ష లేకుండా ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీపీటీ, మేల్ నర్సింగ్, బ్లడ్ బ్యాంకింగ్, ఎనిస్థీషియా, ఆప్తమాలజీ వంటి డిప్లొమా కోర్సులనూ చేయొచ్చు.
అత్యంత సున్నిత పరీక్షలను చేసే డీఎమ్‌ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమాజినింగ్ టెక్నీషియన్), ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్‌లకు సంబంధించిన కోర్సులు కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వ సహాయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

కెరీర్:
లేబొరేటరీల్లో రోగ నిర్ధారణ, తీవ్రత కోసం నిర్వహించే ప్రాక్టికల్, టెక్నికల్ ప్రయోగాల్లో ఈ కోర్సు చేసినవారు పాల్గొంటారు. వ్యాధులు, ప్రమాదాలు, ఆపరేషన్లతోపాటు శరీరంలో సంభవించే ఇతర మార్పులను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలను వీరు నిర్వహిస్తారు.

హాస్పిటల్స్, డయూగ్నస్టిక్ సెంటర్స్, పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వేతనాలు: ప్రారంభంలో రూ.10,000 నుంచి రూ. 15,000 వరకు ఆశించొచ్చు. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్ పెట్టుకోవచ్చు.

బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును
ఆఫర్ చేస్తున్న కళాశాలలు:
మన రాష్ట్రంలో కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, మమత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ సెన్సైస్(ఖమ్మం) ... తదితర సంస్థలు బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సును ఆఫర్ చేస్తున్నారుు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కూడా బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ) కోర్సులను అంది స్తోంది. వెబ్‌సైట్: www.ignou.ac.in

పీజీ స్థాయిలో ఎంఎల్‌టీని ఆఫర్ చేసే సంస్థలు:
శ్రీరామచంద్ర యూనివర్సిటీ, తమిళనాడు
వెబ్‌సైట్:www.srmc.edu
లయోలా కాలేజ్, చెన్నై
వెబ్‌సైట్: www.loyolocollege.edu
పద్మశ్రీ ఇన్‌స్టిట్యూషన్స్- బెంగళూరు

బిట్స్ పిలానీ: ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్), పిలానీ-ఆఫ్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విధానంలో శంకర నేత్రాలయు మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్(తమిళనాడు) సహకారంతో ఎంఎస్(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది.

అర్హత: బీఎస్సీ (బయలాజికల్ సైన్స్) లేదా బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష , ఇంటర్వ్యూల ద్వారా
వెబ్‌సైట్స్:www.sankaranethralaya. org, www.bitspilani.ac.in

పారామెడికల్ కోర్సులు

ఆడియోమెట్రీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్
టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ వంటి పారామెడికల్ కోర్సుల ద్వారా మెడికల్ సంబంధిత రంగంలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంబంధిత పోస్ట్‌లను భర్తీ చేస్తుండటం.. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్య సేవలను చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరు ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధినీ పొందొచ్చు. పారామెడికల్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు పుష్కలం.

ప్రవేశం: మనరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (ఏపీపీఎంబీ) పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లు పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి పారామెడికల్ బోర్డ్ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని కోర్సులకు అర్హత పదో తరగతికాగా, మరికొన్ని కోర్సులకు ఇంటర్మీడియెట్ (బైపీసీ)ను అర్హతగా నిర్ధ్దేశించారు.

కోర్సులు-కెరీర్:
ఆడియోమెట్రీ టెక్నీషియన్: చెవి సంబంధిత పరీక్షలు నిర్వహించడం.. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో నిర్ధారించడం..పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యలను గుర్తించడంలో ఆడియోమెట్రీ టెక్నీషియన్లు డాక్టర్లకు సహాయపడతారు. అంతేకాకుండా ఆయా సమస్యలకు ఆపరేషన్ అవసరమా, లేదా? అనే విషయాన్ని నిర్ధారించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఈ కోర్సును 16 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్: హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ ది కీలక పాత్ర. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం..ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే హార్ట్-లంగ్ మెషిన్ ఎంపిక, అమరికలో..పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్‌లు బాధ్యత వహిస్తారు. ఆపరేషన్ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పెరుగుతుండడంతో వీరి అవసరం పెరుగుతోంది. మనరాష్ట్రంలో ఈ కోర్సును 8 కాలేజీలు అందిస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

రేడియోథెరపీ టెక్నీషియన్: కేన్సర్ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్ ఏ స్థాయిలో ఉంది? దానికి రేడియేషన్ ఎంత స్థాయిలో ఇవ్వాలి? రేడియేషన్ అవసరం ఉందా, లేదా? అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు. ఈ కోర్సును రాష్ట్రంలో 4 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్: ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, ‘బ్రోంకేసో్కిపీ’ టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో 7 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

డయాలసిస్ టెక్నీషియన్: అవుట్ పేషంట్ డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును రాష్ట్రంలో 7 కాలేజీలు అందిస్తున్నాయి.

కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్: గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి రోగ నివారణ సంబంధిత కార్యక్రమాల అమల్లో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఈ కోర్సు రాష్ట్రంలో 209 కళాశాలలు అందిస్తున్నాయి.

బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్: బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, ఇతర విధులు నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ కోర్సు రాష్ట్రంలో 24 కాలేజీల్లో అందుబాటులో ఉంది.

అనస్థీషియా టెక్నీషియన్: శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అన స్థీషియా (మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు డాక్టర్లకు సహాయపడతారు. ఈ కోర్సును రాష్ట్రంలో 17 కాలేజీలు అందిస్తున్నాయి.

మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్: MRI, XRay, CT scan, Ultrasound లాంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు. ఈ కోర్సు రాష్ట్రంలో దాదాపు 25 కాలేజీల్లో ఉంది. కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.

ఫిజియోథెరపీ: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపీకి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపీ సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. కోర్సు పూర్తిచేసినవాళ్లకు పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందొచ్చు.

ఎక్స్‌రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. ఎక్స్ కిరణాలు, అధిక పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను ఉపయోగించి శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ మొదలైనవి నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ.20,000వరకు వేతనాలుంటాయి.

పై అన్ని కోర్సులకూ సంబంధించిన పూర్తి సమాచారం కోసంwww.appmb.org, www.ntruhs.ap.nic.in వెబ్‌సైట్లు చూడొచ్చు.